క్లైమాక్స్‌లో కేబినెట్‌ విస్తరణ.. భేటీ రద్దు?

6 Jul, 2021 10:27 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో ఈ సాయంత్రం ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

2024 ఎన్నికలు లక్క్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్‌ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్‌ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. మొత్తంగా ఏడుగురిపై వేటు పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రుల భేటీ రద్దు?
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం జరగాల్సిన మంత్రుల భేటీ రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మంగళ, గురువారం ప్రధాని పాల్గొనబోయే భేటీలు రద్దైనట్లు పీఎంవో నుంచి ఓ ప్రకటన వెలువడిందని ఆ కథనాల సారాంశం. బీజేపీ చీఫ్‌తో పాటు అమిత్‌ షా సహా మంత్రులు ఈ భేటీకి హాజరవుతారనే ఆశిస్తుండగా.. ఒకవేళ నిజంగా రద్దు అయితే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోదీ-బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సంతోష్ భేటీ మాత్రం యథావిధిగా కొనసాగనుందని మరో కథనం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే జరగాల్సిన కేబినెట్‌ విస్తరణ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు