భారీ ఉగ్ర ముప్పు తప్పింది!

21 Nov, 2020 04:05 IST|Sakshi

భద్రతాబలగాల అప్రమత్తతకు అభినందనలు

నగ్రోటా ఎన్‌కౌంటర్‌పై మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ దేశంలో తలపెట్టిన భారీ ఉగ్రవాద విధ్వంసాన్ని అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్ల పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర ఉన్నతాధికారులతో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంలో భద్రతా బలగాలు గొప్ప శౌర్యసాహసాలను ప్రదర్శించాయి. వారి వద్ద భారీ ఎత్తున లభించిన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు వారు భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద విధ్వంసం తప్పింది’ అని ఆ సమావేశం తరువాత ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘భద్రతా బలగాల అప్రమత్తతకు అభినందనలు.

వారు జమ్మూకశ్మీర్లో క్షేత్రస్థాయిలో జరగనున్న ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే క్రూరమైన కుట్రను విజయవంతంగా అడ్డుకున్నారు’ అని మరో ట్వీట్లో ప్రశంసించారు. ముంబై దాడులు జరిగిన నవంబర్‌ 26న, అదే తరహాలో భారీ ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు కుట్రపన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ హైవేపై నగ్రోటా వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న ట్రక్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో భారీ ఉగ్రదాడి లక్ష్యంతో వారు ఈ మధ్యనే పాక్‌ సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినట్లు భద్రతావర్గాలు భావిస్తున్నాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా