కేరళ సచివాలయ అగ్నిప్రమాదంపై ఆరోపణలు

26 Aug, 2020 10:09 IST|Sakshi

కేరళ సచివాలయ భవనంలో మంటలు.. విపక్షాల ఆరోపణలు

తిరువనంతపురం: కేరళ సచివాలయ భవనంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు.  ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సెక్రటేరియట్‌ రెండో అంతస్తులోని జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) పొలిటికల్‌ సెక్షన్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదం డ్రామాకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ బంగారం కేసు ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయ పరిశీలనలో ఉంది. (చదవండి: తిరుచ్చిలో ఎన్‌ఐఏ దూకుడు)

ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేరళ ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల గవర్నర్ అరిఫ్ మొహమూద్ ఖాన్‌ను కలిసి.. ఇందులో జోక్యం చోసుకోవాలని కోరారు. బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే ఎన్‌ఐఏ, ఈడీ సీఎంఓకు చేరుకుంటాయని తెలిసినందున ఫైళ్లు ధ్వంసమయ్యాయి అని విమర్శించారు. మరోవైపు సెక్రటేరియట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని, పత్రాలను నాశనం చేశామనడం అర్ధరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు