గుడ్‌ న్యూస్‌.. 70 శాతం వరకూ తగ్గనున్న ఔషధాల ధరలు!

25 Jul, 2022 07:48 IST|Sakshi

కీలక మందుల ధరలు 70 శాతం వరకూ తగ్గింపు  

ఆగస్టు 15న కేంద్రం ప్రకటన చేసే అవకాశం

న్యూఢిల్లీ: రోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఔషధాల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రధానంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులకు సంబంధించిన  మందుల ధరల తగ్గనున్నాయి. దీనివల్ల రోగులకు భారీ ఉపశమనం లభించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. మందుల ధరలను నియంత్రించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అంతా అకున్నట్లు జరిగితే వాటి ధరలు 70 శాతం వరకు తగ్గిపోతాయని అధికారులు వెల్లడించారు.

నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియనల్‌ మెడిసిన్‌(ఎన్‌ఎల్‌ఈఎం)–2015ను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రోగులు దీర్ఘకాలం ఉపయోగించే ఔషధాలపై హై–ట్రేడ్‌ మార్జిన్లపై పరిమితి విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు కూడా నిర్వహించింది. ఎన్‌ఎల్‌ఈఎంలో ఉన్న 355 మందుల ధరలపై నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) ఇప్పటికే పరిమితి విధించింది. కొన్ని రకాల షెడ్యూల్డ్‌ మెడిసిన్లపై ట్రేడ్‌ మార్జిన్‌ను హోల్‌సేల్‌ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లపై 16 శాతానికి పరిమితం చేసింది. ఇలాంటి మందుల తయారీదార్లు సీలింగ్‌ ప్రైస్‌ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. మిగతా మందుల విషయంలో ఇలాంటి నియంత్రణలు ఏవీ లేవు. కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. ధరలను కంపెనీలే నిర్ధారించుకోవచ్చు. ధరల నియంత్రణ పరిధిలో లేని ఔషధాలపై ట్రేడ్‌ మార్జిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆ భారమంతా అంతిమంగా రోగులే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఔషధాలను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వాటి ధరలు చాలావరకు తగ్గిపోతాయి.

ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’

మరిన్ని వార్తలు