‘‘దేవుడి ఆధార్‌ కార్డ్‌ తెస్తేనే.. పంట కొంటాం’’

10 Jun, 2021 14:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న వింత సంఘటన

లక్నో: మన భారతదేశ పౌరులం అని చెప్పుకోవాలన్నా.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మనకు దక్కాలన్నా.. అంతేందుకు ఈ దేశ జనాభాలో మన పేరు ఉండాలన్నా.. ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అయ్యింది. మనుషులం కాబట్టి మనకు ఏదో ఓ గుర్తింపు కార్డు అవసరం.. కానీ దేవుడికి కూడా ఆధార్‌ కావాలంటే.. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి. అసలు దేవుడి ఆధార్‌ కార్డ్‌ అడిగిన వారిని  ఏమనుకోవాలి.. అయితే ఇది చదవండి. 

ఉత్తరప్రదేశ్‌ బండాలోని అత్తారా తహసీల్‌లోని కుర్హారా గ్రామానికి చెందిన మహంత్‌ రామ్‌కుమార్‌ దాస్‌ స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో ప్రధాన పూజారిగా మాత్రమే కాకా ఆలయ బాగోగులు చూసుకుంటుండేవాడు. ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు. 100 క్వింటాళ్లకు పైనే పండింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దాస్‌ తమ పంటను అమ్మడానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని.. పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్‌ యార్డ్‌కి వెళ్లాడు. 

అక్కడ అధికారులు పెట్టిన కండీషన్‌కు దాస్‌కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇంతకు ఆ షరతు ఏంటంటే పంట కొనాలంటే.. భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్‌ అయి ఉందో వారి ఆధార్‌ కార్డు తీసుకురావాలి అన్నారు అధికారులు. దానికి ఆ పూజారి ఎందుకంత షాక్‌ అయ్యాడంటే.. ఆ భూమి దేవుడి పేరు మీద అంటే జానకిరాముల పేరు మీద రిజిస్టర్‌ అయి ఉంది. అంటే ఇప్పుడు దాస్‌ తన పంట అమ్మాలంటే శ్రీరాముడు, సీతా దేవిల ఆధార్‌కార్డ్స్‌ తీసుకురావాలి. 

చేసేదేంలేక దాస్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) సౌరభ్ శుక్లాతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని.. పంట కొనలేమని ఆ అధికారి తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగా పూజారి దాస్‌ గత ఏడాది 150 క్వింటాళ్ల ఉత్పత్తులను ప్రభుత్వ మండీలో విక్రయించానన్నాడు. గత కొన్నేళ్లుగా తాను దేవుడి మాన్యంలో పండిన పంటను విక్రయిస్తున్నానని, అయితే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని వాపోయాడు. ఇప్పుడు పంట అమ్మకపోతే తన కుటుంబం పస్తులతో చావడం తప్ప వేరే మార్గం లేదని కంట తడి పెట్టకున్నాడు.  

ఈ సందర్భంగా జిల్లాల సరఫరా అధికారి గోవింద్ ఉపాధ్యాయ మాట్లాడుతూ మఠాలు, ఆలయాల నుంచి వచ్చే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొనుగోలు విధానంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవు, గతంలో “ఖటౌని” (భూ రికార్డులు) ఆమోదయోగ్యమైనవని, అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిందని గోవింద్‌ తెలిపారు.

చదవండి: 
ఆధార్‌ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు
2నిముషాల్లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి!

మరిన్ని వార్తలు