తెరపైకి ‘ప్రాజెక్ట్‌ సంజయ్‌’

7 May, 2023 06:25 IST|Sakshi

సమీకృత యుద్ధ క్షేత్ర నిఘాల కేంద్రాలకు రూపకల్పన

చైనా, పాక్‌ సరిహద్దుల్లో ఏర్పాటుకు ఆర్మీ ప్రణాళికలు

న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్‌ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్‌ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్‌ సంజయ్‌’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ఫీల్డ్‌ సర్వైలెన్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది.

ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్‌ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ఫీల్డ్‌ సర్వైలెన్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్‌ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్‌ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్‌వర్కింగ్‌’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్‌ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్‌(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్‌ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్‌ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు