'నేను అప్పుడే హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేదు'

26 Aug, 2020 12:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గ‌త కొన్ని నెల‌లుగా దేశ ఆర్థిక సంక్షోభం, మోదీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న తీరుపై రాహుల్ విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. తాజాగా భార‌త ఆర్థిక మంద‌గ‌మ‌నంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌నే ఆర్‌బీఐ ధృవీకరించిందంటూ ట్వీట్ చేశారు. 'దేశ ఆర్ధిక పరిస్థితి గురించి నేను నెలల తరబడి హెచ్చరిస్తున్న విషయాన్నే ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది.  పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గింపు కాకుండా పేదలకు డబ్బు పంచండి. వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించండి. మీ ప్రచారాల‌కు మీడియాను వాడుకున్నంత మాత్రాన భార‌త్ ఆర్థిక సంక్షోభంలో ఉంద‌న్న విష‌యం  క‌నిపించ‌క‌మానదు' అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై విమ‌ర్శ‌లు మ‌రోసారి  గుప్పించారు. (‘ఇది ముందే చెప్పాను.. కానీ నన్ను ఎగతాళి చేశారు’)

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం భారతదేశ సంభావ్యతపై నిర్మాణాత్మక క్షీణతకు కారణమవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని తెలిపింది. వినిమయ రంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, డిమాండ్‌ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది.

2008లో దేశ ఆర్థిక సంక్ష‌భంతో పోలిస్తే ప్ర‌స్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని, ఇప్ప‌ట్లో కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ఆర్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డించింది. అయితే ఈ ప‌రిస్థితుల‌పై తాను ఎప్పుడో మాట్లాడిన మోదీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని రాహుల్ ఆరోపించారు. అయితే దేశంలో క‌రోనాను నియంత్రించే ప‌రిస్థితులు, చైనాతో స‌రిహ‌ద్దు వివాదం లాంటి అంశాల‌పై రాహుల్ కేంద్రంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను బీజేపీ నాయ‌కులు జెపి న‌డ్డాతో స‌హా ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు తిప్పికొట్టారు. దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై రాహుల్ బాహాటంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ఫైర్ అవుతున్నారు. (ఆర్థిక కార‍్యకలాపాలు పుంజుకునేందుకు మరింత సమయం)

మరిన్ని వార్తలు