పాలు దొంగిలిస్తున్న రూమ్‌మేట్‌.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!

10 Jun, 2023 11:18 IST|Sakshi

హాస్టల్‌లో రూమ్‌మేట్స్‌ మధ్య గొడవలు జరుగుతుండటం సాధారణమే. ఒకరి వస్తువులను మరొకరు వాడటం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం మొదలైన విషయాల్లో రూమ్‌మేట్స్‌ మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక యువతి తన రూమ్‌మేట్‌ తన ఆహారాన్ని రోజూ దొంగిలిస్తున్నదని గ్రహించి,అత్యంత విచిత్ర రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. 

హాస్టల్‌, లేదా పీజీలో ఉండేవారు అక్కడ లభ్యమయ్యే ఆహారం కన్నా ఇంటి భోజనమే వెయ్యిరెట్లు ఉత్తమమని భావిస్తుంటారు. అందుకే కొందరు బయటి నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో రూమ్‌మేట్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు. అయితే ఇటీవల ఒక యువతి తన ఫ్లాట్‌మేట్‌ నుంచి తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చ్యపోవాల్సిందే. 

సారా అనే యువతి టిక్‌టాక్‌లో @saatj32 హ్యాండిల్‌పై ఒక వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్‌ అవుతున్నారు. ఆమె మరోదారిలేక తాను తన ఆహారాన్ని పాడు చేసుకోవలసి వస్తున్నదని ఈ వీడియోలో పేర్కొంది. తన ఫ్లాట్‌ మేట్‌ తన ఆహారాన్ని చోరీ చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని పేర్కొంది. ఆమె షేర్‌ చేసిన వీడియోలో ఆమె ఒక ఆర్గానిక్‌ బ్రిటీష్‌ సెమీ స్కిమ్డ్‌ మిల్క్‌ డబ్బా తెరుస్తూ కనిపిస్తోంది.

తరువాత ఆమె దానిలో అత్యధిక మోతాదులో ఉప్పు కలిపింది. తరువాత ఆమె కెమెరావైపు చూస్తూ.. తన ఫ్లాట్‌మేట్‌ దొంగచాటుగా పాలను తాగేసి, డబ్బా అక్కడ పెట్టేస్తోంది. ఈ పాలు ఎలా తాగుతుందో ఇప్పుడు చూస్తాను అని పేర్కొంది. ఈ వీడియో క్యాప్షన్‌లో.. ‘ఈ విషయంలో నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పలువురు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్‌ ‘ఇలా చేసేముందు నువ్వు నీ రూమ్‌మేట్‌కు ఒకసారి ఈ విషయం చెప్పి ఉండాల్సింది’ అని రాశారు. 

చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!

మరిన్ని వార్తలు