నేడే రష్యా అధ్యక్షుడి రాక.. ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చలు 

6 Dec, 2021 03:58 IST|Sakshi

న్యూఢిల్లీ, మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ భారత్‌లో ఒక్కరోజు పర్యటనకు సోమవారం రానున్నారు. ఏటా ఇరుదేశాల మధ్య జరిగే వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 20 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 21వ సమావేశంలో పుతిన్,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి చర్చలు జరుపుతారు. గతంలో 2018 అక్టోబర్‌లో పుతిన్, మోదీ మధ్య చర్చలు జరిగాయి. ఈ మూడేళ్లలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన, దానికి రష్యా మద్దతు తెలపడం పాక్‌కు లాభదాయకంగా మారింది.  

మరోవైపు చైనా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతూ భౌగోళిక రాజకీయాలకు తెర తీయడం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా, చైనాతో చేతులు కలిపింది. ఈ అంశాలన్నీ ద్వైపాక్షిక బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకోవడానికి పుతిన్‌ జెనీవాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్‌ చేస్తున్న విదేశీ పర్యటన ఇదే.

పుతిన్, మోదీ సమావేశానికి ముందు ఇరుదేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు చర్చించుకుంటారు. సాధారణంగా పుతిన్‌ విదేశీ ప్రయాణాలపై ఆసక్తి కనబరచరు. అలాంటిది  కరోనా ముప్పుని సైతం లెక్క చేయకుండా పుతిన్‌ భారత్‌కు వస్తున్నారంటే ఆయన మన దేశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారన్న విషయం అర్థమవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అమెరికా, రష్యా మధ్యలో భారత్‌  
రష్యాతో భారత్‌కి సుదీర్ఘ కాలంగా సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొద్ది ఏళ్లుగా అమెరికాతో కూడా మంచి సంబంధాలు నెరుపుతూ ఇరు దేశాలకు సమ దూరం పాటిస్తూ వస్తోంది. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు చేతులు కలిపి క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసి దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్వాడ్‌ కూటమిపై రష్యా గుర్రుగా ఉంది. అమెరికా, చైనా ఆధిపత్య స్థాపన పోరులో రష్యా, భారత్‌లు చెరోవైపు ఉన్నాయి. ఇక ఆయుధాల కొనుగోలులో భారత్‌ ఎప్పుడూ రష్యాపైనే ఆధారపడుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికాను కూడా ఆశ్రయిస్తోంది. ఈ విషయాలన్నింటిపైనా  పుతిన్, మోదీ  చర్చించే అవకాశం ఉంది.  
 

మరిన్ని వార్తలు