ఉచిత పథకాలు తీవ్రమైన అంశమే

27 Jul, 2022 05:07 IST|Sakshi

సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ  

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం  ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు.

హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

ఉచిత పథకాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్‌ అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్‌ను సైతం క్యాన్సల్‌ చేయాలని కోరారు. 

మీడియా నిజాయితీ పాటించాలి   
మీడియా సంస్థలు వ్యాపార ధోరణి వదులుకోవాలని, నిజాయితీగా వ్యవహరించాలని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హితవు పలికారు. వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి మీడియాను ఒక సాధనంగా వాడుకోవద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో గులాబ్‌చంద్‌ కొఠారీ రచించిన ‘ద గీతా విజ్ఞాన ఉపనిషత్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. మన దేశంలో మీడియా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు పొందలేకపోతున్నాయో ఆలోచించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు