భారత్‌ ఏం అడిగినా చేస్తాం.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన రష్యా.. టెన్షన్‌లో అమెరికా..?

1 Apr, 2022 17:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా విదేశాంగ మంత్రి సెర‍్గీ లావ్రోవ్‌ భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో శుక‍్రవారం లావ్రోవ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జైశంకర్‌.. భారత్‌ ఎల్లప్పుడూ వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు.

వీరి భేటీ అనంతరం లావ్రోవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత్​తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. భార‌త్ ఏ వ‌స్తువులు అడిగినా.. వాటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు తాము స‌దా సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే భార‌త్‌తో ఏ విష‌యంపైనైనా చ‌ర్చించ‌డానికి కూడా తాము సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయ ఆదేశాలను సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భారత్​, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేసినట్టు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు. గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లోనూ(ఉక్రెయిన్‌ వార్‌ విషయంలో) రెండు దేశాల మధ్య సంబంధం స్థిరంగా కొనసాగిందన్నారు. ఇత‌ర దేశాల విష‌యాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మ‌క్కువ చూపుతుంద‌ని సెర్గీ లావ్రోవ్ చుర‌క‌లంటించారు. ర‌ష్యా- భార‌త్ సంబంధాల‌పై అమెరికా ఒత్తిళ్లూ ప‌నిచేయ‌వ‌ని తేల్చి చెప్పారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై తాము చేస్తున్న‌ది యుద్ధం కాదని.. అదో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ అని లావ్రోవ్ వెల్లడించారు. తన దేశ బలగాలు సైనిక స్థావ‌రాల‌నే ల‌క్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశాయని అన్నారు.

ఇది చదవండి: పరేషాన్‌లో ఇమ్రాన్‌! పూర్తిగా గాలి తీసేసిన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు