ఢిల్లీని వణికిస్తున్న చలి

2 Jan, 2021 05:57 IST|Sakshi

పదిహేనేళ్ల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: ఉత్తరభారతం చలి దుప్పటి కప్పుకుంది. ఢిల్లీపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రాజధానిలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో మైనస్‌ 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత(ఆల్‌టైమ్‌ కనిష్ఠం) ఢిల్లీలో నమోదయింది. గతేడాది జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర ఢిల్లీలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలిపులి కారణంగా ఉదయం 6గంటల సమయంలో దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంది. దీంతో కనీసం మీటర్‌ దూరంలో వస్తువులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గత గురువారం ఢిల్లీలో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జనవరి 2 నుంచి 6 వరకు మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల(వెస్టర్న్‌ డిస్ట్రబెన్సెస్‌) కారణంగా ఉత్తర భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని ఐఎండీ అధిపతి కులదీప్‌ శ్రీవాస్తవ చెప్పారు. 

మరిన్ని వార్తలు