Sharad Pawar: శరద్‌ పవార్‌ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ

5 May, 2023 13:12 IST|Sakshi

ముంబై: శరద్ పవార్ రాజీనామా ప్రకటనతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న దుమారం మరింత తీవ్రమవుతోంది. తదుపరి ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్‌ పవార్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. రద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్, ప్రఫుల్‌ పటేల్, ఛగన్‌ భుజ్‌బల్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్‌ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్‌ శరద్‌ను కోరింది. కాగా దేశమంతా శరద్‌ పవార్‌ ప్రభావం ఉంది ఆ పార్టీ సినియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు.

2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న శరద్ పవార్‌కు నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఫోన్ చేసి  అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయంపై చర్చించారు. జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్‌ సింగ్‌, సీపీఐకి చెందిన డి రాజా తదితరులు ఎన్‌సీపీ అధినేతతో మాట్లాడారు.
చదవండి: Video: పాక్‌ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్‌

కాగా  24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్‌ పవార్‌ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు  ప్రకటించి షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. తన ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్‌ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది. పవార్‌ రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ అభిమానులు, కార్యకర్తలు భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శరద్‌ పవార్‌ ఎన్సీపీ చీఫ్‌కు రాజీనామా ప్రకటించడంతో పార్టీ జాతీయ కార్యదర్శి సహా మరికొందరునేతలు కూడా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే తన నిర్ణయంపై పునరాలోచిస్తానని ఇందుకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్‌ కోరారు.

కాగా ఎన్సీపీ నేత, శరద్‌ సోదరుడి కుమార్‌ అజిత్‌పవార్‌ బీజేపీలో చేరనున్నట్లు కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్‌ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్‌ హఠాత్‌ ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో అజిత్‌ను కాషాయ పార్టీలోకి వెళ్లనివ్వకుండా ఆపేందుకు ఎన్సీపీలో చీలిక ఏర్పడకుడదనే ఉద్దేశ్యంతో శరద్‌ ఈ నిర్ణయం తీసుకుఒని ఉంటారని భావిస్తున్నారు.
చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్‌ కన్నడనాట తీవ్ర పోటీ

మరిన్ని వార్తలు