వీడియో: యోగి సర్కార్‌పై సెటైరికల్‌ సాంగ్‌.. జానపద గాయనికి నోటీసులు

22 Feb, 2023 15:30 IST|Sakshi

ప్రముఖ భోజ్‌పురి గాయని నేహా సింగ్‌ రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్‌ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ  నేహా సింగ్‌ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్‌-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు.

ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్‌ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు.  ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్‌ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు.

యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్‌ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్‌ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్‌పురి సింగర్‌ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు.

మరిన్ని వార్తలు