ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా

23 Jun, 2022 07:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట గురువారం నాడు హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విచారణ కొన్ని వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న ఆమె తాను ఇంకా కోలుకోలేదని, సంపూర్ణంగా కోలుకున్నాక విచారణకు హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

రెండు రోజుల కిందటే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సోనియాగాంధీకి వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఆమె ఈడీకి విచారణ వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారని పార్టీ నేత జైరామ్‌ రమేష్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో వెల్లడించారు. ఇప్పటికే సోనియా కుమారుడు రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు గత అయిదు రోజులుగా గంటల తరబడి విచారించిన విషయం తెలిసిందే.   

ఇదిలా ఉండగా.. నేషనల్‌ హెరాల్డ్‌ కోసులో ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా రాహుల్‌ గాంధీని విచారించారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ సాగిన తీరుతెన్నులను వారితో సరదాగా పంచుకున్నారు. ‘‘అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చునేంత ఓపిక ఎలా వచ్చిందని అధికారులు నన్ను ప్రశ్నించారు. ముందు చెప్పను పొమ్మన్నాను. విపాసన ధ్యానప్రక్రియను సాధన చేస్తుండటమే అందుకు కారణమని తర్వాత సరదా కారణం చెప్పా. అసలు కారణమేంటో తెలుసా? ఆ చిన్న గదిలో, ముగ్గురు ఈడీ అధికారుల సమక్షంలో కూర్చున్నా నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్‌ కలగలేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా స్ఫూర్తి నా వెంటే ఉంది. పైగా 2004 నుంచీ ఓ కార్యకర్తగా పార్టీ కోసం చేస్తున్న పని నాకు ఎంతో ఓపికను నేర్పింది’’ అన్నారు. 

ఇది కూడా చదవండి: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

మరిన్ని వార్తలు