‘రౌడీ’ కాదు.. నా భర్త ఒక బీజేపీ నేత.. శ్రీకాంత్‌ భార్య అను ఆవేదన

10 Aug, 2022 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళతో దురుసుగా ప్రవర్తించిన నేరంలో ‘గుండా యాక్ట్‌’ ప్రకారం అరెస్ట్‌ అయ్యాడు శ్రీకాంత్‌ త్యాగి. బీజేపీ నేత(బీజేపీ యువమోర్చా)గా తనను తాను ప్రచారం చేసుకున్న శ్రీకాంత్‌.. అక్రమ కట్టడాల వ్యవహారంలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి ఆమెను దర్భాషలాడుతూ.. దాడికి యత్నించి కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో.. ఎట్టకేలకు సీఎం యోగి ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. 

శ్రీకాంత్‌ త్యాగి అక్రమకట్టడాలను బుల్డోజర్‌లతో కూల్చేయడంతో పాటు అతని అరెస్ట్‌కు ఆదేశించింది కూడా. దీంతో..  నొయిడా పోలీసులు పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇక ఈ వ్యవహారంపై శ్రీకాంత్‌ త్యాగి భార్య అను త్యాగి స్పందించింది. తన భర్త రౌడీనో, గూండానో కాదని.. ఆయన ఒక బీజేపీ నేత అంటూ మీడియాకు స్పష్టం చేసింది. బీజేపీ వాళ్లు అవునన్నా.. కాదన్నా ఆయన బీజేపీ నేతనే. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పార్టీ కోసం పని చేఏస్తున్నారు. ఈ విషయంలో వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఓ మహిళనే కదా.. నన్ను ఇంతగా పోలీసులు వేధిస్తుంటే యోగి సర్కార్‌ ఏం చేస్తోంది? అని నిలదీశారామె. 

‘నా భర్త బీజేపీ సభ్యుడే. ఆయన చేసింది తప్పే కావొచ్చు. కానీ, బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ వల్లే ఇదంతా జరుగుతోంది. ఆయన పోలీస్‌ కమిషనర్‌ను దుర్భాషలాడారు. అందుకే పోలీసులు మాపై ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఘటన జరిగిన రోజే నా భర్త పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. అయితే లాయర్‌ కోసమే మేం ఆగాల్సి వచ్చింది. నా భర్త కూడా తనంతట తానే లొంగిపోయాడని.. ఆయన్ని ఎరవేసి ఎవరూ పట్టుకోలేదని ఆమె స్పష్టం చేసింది. 

తన సిబ్బందిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆమె.. తనను అదుపులోకి తీసుకోవడంతో పాటు తన పిల్లలను సైతం నొయిడా పోలీసులు వేధించారంటూ ఆరోపించారు. నన్ను కూడా మానసికంగా హింసించారు. అన్నిరకాలుగా మాతో అసభ్యంగా ప్రవర్తించారు. కానీ, మేం మాత్రం చాలా ఓపికగా దర్యాప్తునకు సహకరించాం. మహిళలకు న్యాయం చేస్తున్న సీఎం యోగి.. నా విషయంలో ఎందుకిలా మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదంటూ వాపోయింది. 

తన అరెస్టు తర్వాత, శ్రీకాంత్ త్యాగి ఆ మహిళ తన సోదరి లాంటిదని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి మొత్తం వివాదాన్ని సృష్టించారని మీడియాతో చెప్పాడు. ఒకవైపు శ్రీకాంత్‌ త్యాగితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెబుతున్నప్పటికీ.. మహిళపై దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్‌ కార్లపై బీజేపీ జెండాలు, ఎమ్మెల్యే స్టిక్కర్ దర్శనమివ్వడం విశేషం. కిసాన్‌ మోర్చా కీలక సభ్యుడిగా వ్యవహరించిన శ్రీకాంత్‌ త​ఆయగి.. మరోవైపు  బడా నేతలతోనూ వ్యక్తిగతంగా కలిసిన ఫొటోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే ఇదే శ్రీకాంత్‌ త్యాగి.. స్థానిక ఉద్యమకారిణి అయిన తన స్నేహితురాలితో ఓ అపార్ట్‌మెంట్‌లో అడ్డంగా భార్య అను త్యాగికి దొరికిపోయారు. ఆ సమయంలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇదీ చదవండి: సీఎం యోగితో అంత ఈజీ కాదు.. కటకటాల్లోకి బీజేపీ నేత

మరిన్ని వార్తలు