రామాలయానికి లంక నుంచి శిల

21 Mar, 2021 13:58 IST|Sakshi

అయోధ్య: లంకాధీశుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణం పేర్కొంటున్న ప్రాంతం నుంచి ఒక రాయిని సేకరించి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందజేస్తామని కొలంబోలోని భారత హైకమిషన్‌ కార్యాలయం తెలిపింది. రెండు దేశాల మధ్య మైత్రీబంధానికి ఒక తార్కాణంగా ఇది నిలువనుందని పేర్కొంది. సీతాఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన ఈ శిలను త్వరలోనే శ్రీలంక హై కమిషనర్‌ మిళింద మొరగొడ భారత్‌కు తీసుకువస్తారని తెలిపింది. 

మరో 1.15 లక్షల చ.అడుగుల భూమి

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రామ జన్మభూమి పరిసరాలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో 1.15లక్షల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. ట్రస్ట్‌ కార్యకలాపాలు, భద్రతా సిబ్బంది, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు దీనిని వినియోగిస్తామని ట్రస్ట్‌ అధికారి ఒకరు తెలిపారు. రామ్‌కోట్, తెహ్రి బజార్‌ ప్రాంతంలోని భూమిని చదరపు అడుగు రూ.690 చొప్పున, రూ.8 కోట్లకు గత వారమే కొన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు