పార్లమెంట్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

15 Aug, 2021 12:07 IST|Sakshi

న్యూఢిల్లీ: చట్టసభల్లో చట్టాలపై సరిగ్గా చర్చ జరగడం లేదని, అవి రూపొందించే స‌మ‌యంలో చ‌ర్చ‌ల‌పై కాకుండా ఆటంకాలు సృష్టించ‌డంపైనే సభ్యులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నార‌ని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల చర్చల్లో రోజురోజుకు నాణ్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టాల రూపకల్పనలో సమగ్రత లోపించడం లిటిగేషన్లకు దారి తీస్తోందని ఆరోపించారు. కొన్ని చట్టాలను కోర్టులు సైతం అర్థం చేసుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జడ్జిలు, లాయర్లను ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు ఆవరణలో మాట్లాడుతూ.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

ఇటీవలి కాలంలో రూపొందించిన చట్టాలు తికమక పెట్టేవిగా ఉన్నాయని, వాటిని సరిగ్గా అర్ధం చేసకోలేని సామన్య ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారని ఆయన అన్నారు. స్వాతంత్రోద్యమంలో న్యాయవాదులు ప్రధాన పాత్ర పోషించారని, భారత దేశపు తొలి చట్టసభలో మెజారిటీ సభ్యులు లాయర్లేనని ఈ సందర్భంగా ప్రస్తావించారు. స‌భ‌ మొత్తం లాయ‌ర్లే ఉన్న స‌మ‌యంలో పార్ల‌మెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని, సభ కూడా ఎంతో హుందాగా న‌డిచేద‌ని.. లాయ‌ర్లు, మేధావులు స‌భ‌లో లేనప్పుడు చట్టసభల్లో ఇలానే జ‌రుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా ప్రజాసేవ కూడా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు