హైకోర్టుల నైతిక స్థైర్యం దెబ్బతీయలేం

4 May, 2021 08:21 IST|Sakshi

కేసుల విచారణను మీడియా రిపోర్ట్‌ చేయడాన్ని నియంత్రించలేం  

ఈసీపై మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందన 

న్యూఢిల్లీ: కేసుల విచారణ సమయంలో ప్రజాప్రయోజనం లక్ష్యంగా వ్యాఖ్యలు చేసే హక్కు మీడియాకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, హైకోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీయాలన్న ఆలోచన కూడా తమకు లేదని స్పష్టంచేసింది. హైకోర్టులు ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యవస్థలని వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్నికల సంఘం వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య సమన్వయం, సమతౌల్యం కోసం ప్రయత్నిస్తామని పేర్కొంది.

విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలను రిపోర్ట్‌ చేయకుండా మీడియాను నియంత్రించాలన్న ఈసీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణమని, ఎన్నికల సంఘం అధికారులపై హత్య అభియోగాలు నమోదు చేయాలని ఇటీవల మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈసీని కించపర్చే ఉద్దేశంతో హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగా తాము భావించడం లేదని, విచారణలో భాగంగా చేసిన భావవ్యక్తీకరణగా ఆ వ్యాఖ్యలను తాము భావిస్తున్నామని పేర్కొంది. అందువల్లనే ఆ వ్యాఖ్యలు హైకోర్టు ఉత్తర్వుల్లో లేవని తెలిపింది. కోర్టుల్లో విచారణ సందర్భంగా జరిగే సంభాషణలు, కామెంట్లను రిపోర్ట్‌ చేయవద్దని మీడియాను కోరలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎవరినైనా కోర్టు ప్రశ్నిస్తుందంటే, వారికి కోర్టు వ్యతిరేకమని అర్థం కాదని వ్యాఖ్యానించింది. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులు వ్యాఖ్యలు చేస్తుంటాయని, వ్యవస్థలను ప్రశ్నించకూడదని ఆదేశించి హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని తాము దెబ్బతీయలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా లాయర్లు, జడ్జీల మధ్య ఎలాంటి అవరోధాలు లేని చర్చ జరగడం అవసరమని పేర్కొంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వ్యాఖ్యానించింది. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ద్వివేదీ వాదిస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై హత్యాభియోగాలు నమోదు చేయాలంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.


 

మరిన్ని వార్తలు