వర్గాల పేరుతో రెచ్చగొట్టే శక్తులను తరిమికొట్టాలి..

28 Mar, 2022 06:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: కులం, మతం అంటూ చిచ్చు పెట్టడం, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చొరబడే శక్తుల్ని తరిమి కొట్టాలని దుబాయ్‌లోని తమిళులకు సీఎం ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రూ. 2,600 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రకటించారు.  సీఎం ఎంకే స్టాలిన్‌ దుబాయ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెట్టుబడిదారుల్ని ఆకర్షించి తమిళనాడులోకి పెద్దఎత్తున పెట్టుబడుల్ని ఆహ్వానించే దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఇక శనివారం రాత్రి దుబాయ్‌లోని తమిళులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమైనట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పెద్దఎత్తున తమిళులతో కలిసి సాగి న ఈ సమావేశం గురించి స్టాలిన్‌ ట్వీట్‌ కూడా చేశా రు.  దుబాయ్‌లోని తమిళులు ఏకమైన ‘నమ్మిల్‌ ఒరువర్‌...నమ్మ మొదల్వర్‌’( మనలో ఒక్కడు మన సీఎం ) నినాదంతో జరిగిన ఈ సభ తనను ఆనంద సాగరంలో ముంచిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్నామా..? దుబాయ్‌లో ఉన్నామా..? అన్నది తెలియని పరిస్థితి అని, ఈ మేరకు వేలాదిగా ఇక్కడ తమిళులు సభకు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. సముద్రాలు దాటి వచ్చి, ఇక్కడ జీవిస్తున్న ప్రతి తమిళుడు ఐక్యతతో ముందుకు సాగాలని, ఇదే అందరికీ బలం అని సూచించారు. అయితే, కులం, మతం అంటూ రాజకీయం చేసే విచ్ఛిన్నకర శక్తుల్ని అనుమతించ వద్దని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  
రూ. 2600 కోట్ల పెట్టుబడులు..
తమిళనాడు పెట్టుబడులకు నెలవు అని, ఈ మేరకు పారిశ్రామికవేత్తలు తరలి రావాలని సీఎం స్టాలిన్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రూ. 2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక పలు సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో సీఎం ఆదివారం భేటీ అయ్యారు. 2030 నాటికి తమిళనాడును అన్ని రంగాల్లో ముందు ఉంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధి కల్పనల మెరుగు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు విస్తృతం చేశా మని వివరించారు. ఈ సందర్భంగా రూ. 2,600 కోట్ల పెట్టుబడులకు తగ్గ ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. తద్వారా 4,500 మందికి ఉద్యోగ అవ కాశాలు దక్కనున్నట్లు పేర్కొన్నారు. ఇక, దుబాయ్‌ పర్యటన ముగించుకుని సాయంత్రం అబుదాబికి స్టాలిన్‌ బయలు దేరివెళ్లారు. సోమవారం సీఎంకు అబుదాబీలో అభినందన సభ నిర్వహించనున్నారు.  

కుటుంబ పర్యటన..
సీఎం స్టాలిన్‌ అధికారిక పర్యటనగా కాకుండా ఫ్యామిలీ టూర్‌గా వెళ్లినట్టుందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్‌ పళనిస్వామి విమర్శించారు. అధికారిక పర్యటనగా పైకి చెప్పుకున్నా, ప్రజాధనంతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని సీఎం కుటుంబం అంతా దుబాయ్‌కు వెళ్లినట్లుందని ఆరోపించారు. ప్రజలకు ఈ పర్యటనతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేవలం సీఎం కుటుంబానికి లాభం చేకూర్చే పరిశ్రమల ఏర్పాటుకే ఈ పర్యటన సాగినట్లుందని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు