వీడియో: కోపధారి మంత్రి.. కార్యకర్తలపైకి రాయి విసిరాడు

24 Jan, 2023 21:08 IST|Sakshi

వైరల్‌: తమిళనాడు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఎస్‌ఎం నాజర్‌ తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆయన రాయి విసిరిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 

తిరువల్లూరు జిల్లాలో బుధవారం జరగబోయే ఓ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరు కావాల్సి ఉంది. ఆ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి నాజర్‌ వెళ్లారు. అయితే.. ఆ సమయంలో ఆయనకు కూర్చోవడానికి కుర్చీ లేదట. వెంటనే ఆయన కార్యకర్తలపై కుర్చీ తేవాలని కేకలు వేశారు. అయితే.. అది తేవడం కాస్త ఆలస్యం కావడంతో సహనం కోల్పోయిన ఆయన అలా రాయి విసిరారు. మంత్రి నాజర్‌ రాయి విసిరి.. కార్యకర్తలను దూషిస్తున్న టైంలో వెనుకాల ఉన్న వాళ్లంతా నవ్వడం ఆ వీడియోలో చూడొచ్చు.  


ఇదిలా ఉంటే.. ఈ డీఎంకే మంత్రి స్వతహాగానే ఇలా తరచూ తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారట. కార్యకర్తపై రాయి విసిరిన ఆయన తీరుపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహుశా దేశ చరిత్రలో ఇలా ఏ మంత్రి కూడా జనాల మీదకు రాళ్లు విసిరి ఉండకపోవచ్చు అంటూ ట్వీట్‌ చేశారాయన.  డీఎంకేవాళ్లు ఎదుటివాళ్లను బానిసలుగా చూస్తారనడానికి ఇదే నిదర్శనం కాబోలు అంటూ ట్వీట్‌ చేశారాయన. ఇంకోవైపు ఈ కోపధారి మంత్రిపై సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మంత్రిగారి కంటే రౌడీలే నయం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు