హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ అగ్ర నేత హతం

8 Jul, 2021 07:57 IST|Sakshi

శ్రీనగర్‌: ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన అగ్ర కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వై అలియాస్‌ ఉబెయిద్‌ హతమయ్యాడని కశ్మీర్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. కుప్వారా జిల్లాలోని గాండర్స్‌ ప్రాంతంలో పోలీసులు బుధవారం సాధారణ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వాహనంలో గ్రెనేడ్‌ ఉండటంతో పోలీసులు హల్వైని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తుండగా, ఆయన హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌కుచెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. విచారణలో భాగంగా ఆయుధాలు దాచిన స్థలాన్ని పోలీసులకు వెల్లడించాడు.

అనంతరం పోలీసులు హల్వైని ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి చేరుకున్న తర్వాత ఆయుధాల గదిలోని ఏకే 47తో భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కూడా తిరిగి కాల్పులు జరపడంతో హల్వై హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాది అగ్ర కమాండర్‌ అని, వృద్ధనేత అని డీజీపీ పేర్కొన్నారు. పోలీసులు, ప్రజలు సహా పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్న హల్వై హతం కావడం భద్రతా బలగాలకు గొప్ప విజయమని అభిప్రాయపడ్డారు. లొంగిపోయేందుకు ఉగ్రవాది నిరాకరించి కాల్పులు ప్రారంభించడంతో పరిస్థితి ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఘటనా స్థలంలోని ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల రికార్డు ప్రకారం ఉగ్రవాది ఏ++ కేటగిరీకి చెందినవాడని కశ్మీర్‌ పోలీస్‌ ప్రతినిధి చెప్పారు. యువకులను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించే పనుల్లో హల్వై హస్తం ఉందని చెప్పారు.  


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు