కశ్మీర్‌ను శాంతివనంగా మారుస్తాం! పాక్‌తో చర్చలపై హోం మంత్రి ఏమన్నారంటే..

5 Oct, 2022 17:31 IST|Sakshi

బారాముల్లా: పాకిస్తాన్‌తో చర్చలు జరిపే అంశం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. కశ్మీర్‌ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఈ దరిమిలా.. జమ్ము కశ్మీర్‌ బారాముల్లాలో బుధవారం ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి అమిత్‌ షా చర్చలు ససేమిరా అని స్పష్టం చేశారు. 
 
ఉగ్రవాదం అనేది 1990 నుంచి జమ్ము కశ్మీర్‌లో 42వేల మంది ప్రాణాలను బలిగొంది. అలాంటిదానితో ఎవరికైనా ఉపయోగం ఉంటుందా?. అబ్దుల్లాలు, ముఫ్తీలు, నెహ్రూ కుటుంబం.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ అభివృద్ధి అడ్డుకుంటూనే ఉంటున్నారు. పైగా కొంతమంది పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని మాకు సూచిస్తున్నారు. అసలు పాక్‌తో ఎందుకు మాట్లాడాలి?. ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలి? మేం చర్చలు జరపం.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్ని గ్రామాలకు కరెంట్‌ ఉందో వాళ్లకు తెలుసా?. కానీ.. కశ్మీర్‌లో ఈ మూడేళ్లలోనే అన్ని గ్రామాలకు కరెంట్‌ వచ్చింది.  కావాలంటే మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడతాం.. వాళ్ల సమస్యలు తెలుసుకుని తీరుస్తాం అని చర్చల ఊసే ఉండబోదనే స్పష్టత ఇచ్చారు అమిత్‌ షా. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. టెర్రరిజాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించబోదు. దానిని తుడిచిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్‌’పై దర్యాప్తు

మరిన్ని వార్తలు