వడ్డీమాఫీపై స్పష్టత ఇవ్వండి

27 Aug, 2020 04:44 IST|Sakshi

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

వారంలోగా నిర్ణయించండి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా రుణవాయిదాలపై మారటోరియం విధించిన కేంద్ర ప్రభుత్వం ఆ వాయిదాలపై వడ్డీని మాఫీ చేసే విషయమై ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పలు అధికారాలు ఉన్నప్పటికీ ఆర్బీఐ సాకు చూపుతూ ఈ అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌  కేంద్రాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలన్న సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ వారం గడువు ఇచ్చింది.

ఈ సందర్భంగా తుషార్‌ మెహతా మాట్లాడుతూ తాము ఈ అంశంపై ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా లతో కూడిన బెంచ్‌కు తెలిపారు. కేంద్రం విపత్తు నిర్వహణ చట్టంపై  స్పష్టత కల్పించాలని, ఇప్పటికే వసూలు చేస్తున్న వడ్డీపై అదనపు వడ్డీ వసూలు  సాధ్యమవుతుందా? అని బెంచ్‌ ప్రశ్నించగా తుషార్‌ మెహతా స్పందిస్తూ... అన్ని సమస్యలకు సాధారణ పరిష్కారం ఉండదన్నారు. ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ  సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేస్తూ మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. రుణ వాయిదాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం సరికాదని, దీనివల్ల తనకు సమస్యలు వస్తున్నాయని గజేంద్ర శర్మ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తను జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని  గజేంద్ర శర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. రుణ వాయిదాలపై  మారటోరియం గడువును  పొడిగించాలని కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు