మహిళా రక్షణ మాతోనే సాధ్యం

11 Feb, 2022 04:37 IST|Sakshi

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

సహరన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్‌ తలాక్‌ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

2013లో జరిగిన ముజఫర్‌నగర్‌ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్‌పూర్‌ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్‌యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్‌ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు.  

బిపిన్‌రావత్‌ కటౌట్‌ వాడుకుంటున్నారు...  
ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్‌ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.

నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం
పండిట్‌ జనవహర్‌లాల్‌ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు.  

మరిన్ని వార్తలు