‘ఉద్యమం ఇప్పట్లో ఆగదు.. ఆయన జయంతి వరకూ కొనసాగిస్తాం’

6 Feb, 2021 16:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమం కొత్త రూపం తీసుకుంటోంది. ఎన్ని వేధింపులు.. అడ్డంకులు సృష్టించినా రైతులు వెనుతిరగడం లేదు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు, రైతు నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై జెండా ఎగురేయడంపై ఉద్యమం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శనివారం జాతీయ రహదారుల దిగ్బంధం (చక్కా జామ్‌) కార్యక్రమం చేపట్టగా దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అయితే తాము ఇప్పట్లో ఇళ్లకు వెళ్లమని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు అక్కడే కూర్చుంటామని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు.

చక్కా జామ్‌ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ- ఉత్తరప్రదేశ్‌ రహదారి ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ మాట్లాడారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని రాకేశ్‌ ప్రకటించారు. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా రైతుల ఈ పిలుపుతో ఉద్యమం తారస్థాయికి చేరనుంది.

మరిన్ని వార్తలు