మహిళా ఐపీఎస్‌ను చిక్కులో పడేసిన ‘ఫ్రీ బిర్యానీ ఆర్డర్‌’

30 Jul, 2021 21:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అధికారం చేతిలో ఉందని ఓ మహిళా పోలీస్‌ అధికారిణి చేసిన పని చివరికి ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. మహిళా ఐపీఎస్‌ అధికారిణి ఉచితంగా బిర్యానీ ఆర్డర్‌ చేయడం, ఈ విషయం ప్రభుత్వం వరకు చేరడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఈ విషయం ఆ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై విచారించాలని పోలీసులను ఆదేశించారు.

మహారాష్ట్రలో డిప్యూటీ కమిషనర్‌ ర్యాంకులో మహిళా ఐపీఎస్‌ అధికారిణి తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ రెస్టారెంట్‌లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగి తెలుసుకున్నారు. దీనికి అతను దేశీ ఘీ రెస్టారెంట్‌ అక్కడ ఫేమస్‌ అని చెప్పడంతో మటన్‌ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్‌ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడించమని చెప్పింది. ఎందుకంటే తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా అని మహిళా అధికారిణి అడిగింది. దీనికి సబార్డినేట్‌ ‘మేము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్‌ చేసినా డబ్బులు చెల్లించేవాళ్లం’ అని చెప్పాడు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్‌ ‘ఇప్పుడు సమస్య ఏంటి మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా, అక్కడి ఇన్‌స్పెక్టర్‌ చూసుకుంటాడని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విషయంపై ఐపీఎస్‌ అధికారిణి స్పందించింది.

తన ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్‌ చేశారని ఆరోపించింది. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందన్నారు. ‘ఇది నాపై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. నేను చేస్తున్న జోన్‌లో కొన్నేళ్లుగా కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి కార్యకలాపాలు ఆగిపోయాయి. అందుకే నన్ను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారు’ అని తెలిపారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ తతాంగమంతా ఆ రాష్ట్ర హోం మంత్రికి చేరింది. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్‌ని కోరారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

>
మరిన్ని వార్తలు