మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్‌

15 Jul, 2022 18:28 IST|Sakshi

కర్నాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యకు ఓ మహిళ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. రూ.2 లక్షల నష్ట పరిహార డబ్బును ఆయనపై ఓ మహిళ విసిరిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. బాగల్‌కోట్ జిల్లాలోని కెరూర్‌లో ఈ నెల 6వ తేదీన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. యాసిన్‌ అనే వ్యక్తి.. ఓ వర్గానికి చెందిన యువతిని వేధిస్తున్నాడన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, యాసిన్‌ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. 

అనంతరం, హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ముస్లింలపై దాడి చేసి వారి ఇళ్లు, షాపులకు నిప్పుపెట్టారు. దీంతో, ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. అనంతరం రెండు వర్గాలకు చెందిన 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్కడ సెక్షన్‌ 144 విధించారు. 
ఇదిలా ఉండగా.. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు సిద్దరామయ్య శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం, నాలుగు కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున రూ. 2 లక్షలు అందించి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. 

అయితే, సిద్దరామయ్య కారులో బయలుదేరుతుండగా.. ఓ మహిళ ఆయన వద్దకు వచ్చి.. తమకు డబ్బులు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు డబ్బులు అక్కర్లేదని సిద్ధరామయ్య ముఖం మీదే చెప్పింది. ఘటన జరిగి వారం దాటాక ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారని ఆమె నిలదీసింది. ఈ క్రమంలో సిద్దరామయ్య కారులో వెళ్తుండగా.. ఆమె డబ్బులు డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఆయన తీసుకోకపోవడంతో కాన్వాయ్‌పైకి డబ్బును విసిరేసింది. అనంతరం, ఓ వ్యక్తి వచ్చి కింద పడిన డబ్బును తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కర్నాటకలో ఈ ఘటన పొలిటికల్‌గా హీట్‌ను పెంచింది. 

ఇది కూడా చదవండి: నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. కానీ ఇది కరెక్ట్‌ కాదు

మరిన్ని వార్తలు