అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!

30 Mar, 2022 10:30 IST|Sakshi

న్యూయార్క్‌: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ స్కీముతో అక్రమంగా ఒక మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.7.5 కోట్లు) పైగా లాభాలు ఆర్జించారంటూ భారత సంతతికి చెందిన ఏడుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) ప్రకారం.. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ ట్విలియోలో హరి ప్రసాద్‌ సూరి, లోకేష్‌ లగుడు, ఛోటు ప్రభు తేజ్‌ పులగం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేసేవారు.

కంపెనీకి సంబంధించిన అంతర్గత వివరాలను వీరు తమ స్నేహితులైన దిలీప్‌ కుమార్‌ రెడ్డి కముజుల, సాయి నెక్కలపూడి, అభిషేక్‌ ధర్మపురికర్, చేతన్‌ ప్రభు పులగంలకు చేరవేసేవారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని వీరంతా ట్విలియో ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ చేశారు.  2020 తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి ముందు ఈ విధంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వీరు 1 మిలియన్‌ డాలర్ల పైగా లాభాలు అక్రమంగా ఆర్జించినట్లు ఎస్‌ఈసీ అభియోగాలు మోపింది.

సూరి, లోకేష్, ఛోటులు ప్రత్యేకంగా చాటింగ్‌ కోసం కంపెనీలో ప్రైవేట్‌ చానల్‌ ఏర్పాటు చేసుకుని .. 2020 మార్చి-మే మధ్య కాలంలో కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల అంచనాల గురించి తెలుగులో చర్చించుకున్నారని తెలిపింది. అప్పట్లో 110 డాలర్లుగా ఉన్న షేరు 150 డాలర్లకు వెడుతుందని వారు అంచనాకు వచ్చారని ఎస్‌ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా లబ్ధి పొందేందుకు, తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీరంతా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉపయోగించుకున్నారని తెలిపింది. నిందితులు ఇలా సెక్యూరిటీస్‌ ఎక్సే్చంజ్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఎస్‌ఈసీ పేర్కొంది.

(చదవండి: హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వ‌చ్చేస్తుందిగా) 

మరిన్ని వార్తలు