అర్హులందరికీ పింఛన్‌ అందించాలి

5 May, 2023 02:02 IST|Sakshi
లబ్ధిదారుకు పింఛన్‌ మంజూరు పత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యేలు

అధికారులకు సూచించిన ఎమ్మెల్యే తారాప్రసాద్‌

జయపురం: రాజకీయాలకు తావులేకుండా అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి సమితి అధికారులకు సూచించారు. పింఛన్‌ మరొకరిపై దయతో ఇచ్చేది కాదని, అది వారి హక్కని స్పష్టంచేశారు. దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, మంజూరు చేయాలని కోరారు. బొరిగుమ్మ సమితి కార్యాలయంలో గురువారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే పద్మినీ దియాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురూ 288మంది లబ్ధిదారులకు పెన్సన్‌ మంజూరు పత్రాలను అందజేశారు. జయపురం అసెంబ్లీ పరిధిలోని 19 పంచాయతీల్లో 140మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు, కొట్‌పాడ్‌ నియోజకవర్గ పరిధి 12 గ్రామ పంచాయతీల్లోని 148మందికి పింఛన్లు మంజూరయ్యాయి. కార్యక్రమంలో బొరిగుమ్మ బీడీఓ ప్రణయరంజన్‌ బెహరా, ఏబీడీఓ మురళీ ఆచారి, సంక్షేమశాఖ అధికారులు డాక్టర్‌ శుభశ్రీ మిశ్రా, బిశ్వజిత్‌ శత్పతి, రాజకిశోర్‌ సాహు, దీప్తిరాణి ప్రధాన్‌, సబ్‌ డివిజన్‌ సామాజిక సురక్షా అధికారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఝార్సుగుడ ప్రచారంలో నవరంగ్‌పూర్‌ ఎంపీ

కొరాపుట్‌: ఝార్సుగుడ ఉప ఎన్నిక ప్రచారంలో నవరంగ్‌పూర్‌ ఎంపీ రమేష్‌చంద్ర మాఝి పాల్గొన్నారు. నియోజకవర్గం లోని కొలాబెరా సమితి సోడామాల్‌ పంచాయతీలో గురువారం ప్రచారం నిర్వహించారు. బీజూ జనతాదళ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపాలి దాస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మరోవైపు అవిభక్త కొరాపుట్‌ జిల్లాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే ఝార్సుగుడలో మకాం వేశారు. తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు చేపడుతున్నారు.

రూ.20 లక్షల విప్పపువ్వు స్వాధీనం

నిందితుడి అరెస్ట్‌ చేసి, కోర్టుకు తరలించిన పోలీసులు

రాయగడ: సారా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వినియోగించే విప్పపువ్వును అక్రమంగా లారీలో తరలిస్తుండగా ఎకై ్సజ్‌శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ ధనేశ్వర్‌ పాత్రొను అరెస్ట్‌ చేసి, కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి ఎకై ్సజ్‌శాఖ అదనపు సూపరింటెండెంట్‌ గుప్తేశ్వర ప్రధాన్‌ తెలిపిన వివరాల ప్రకారం... విప్పపువ్వు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లా కేంద్రానికి సమీపంలోని గుమ్మ ఘాటీ వద్ద ఎకై ్సజ్‌ సిబ్బంది గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌ సమితి సికరపాయి నుంచి వస్తున్న లారీని తనిఖీ చేయగా, 49.20 క్వింటాళ్ల విప్పపువ్వు, 14 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం, 32 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని కోర్టుకు తరలించారు. బహిరంగ మార్కెట్‌లో విప్పపువ్వు విలువ రూ.20 లక్షలు ఉంటుందని, అలాగే లారీని స్వాధీనం చేసుకున్నామని ఐఐసీ తెలిపారు. వీటిని కొరాపుట్‌ జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.

320కిలోల గంజాయి స్వాధీనం..

బరంపురం: నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న 320 కిలోల గంజాయిని సురడా పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ అధికారి తపన్‌కుమార్‌ నాయక్‌ అందించిన సమాచారం ప్రకారం కొందమాల్‌ జిల్లా దరింగబడి నుంచి బరంపురం నగరానికి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సామాచారం అందింది. ఈ మేరకు గంజాం జిల్లా సురడా పోలీసులు.. మార్గం మధ్యలో రెక్కీ నిర్వహించి, వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు. అటుగా వస్తున్న కారులో సోదా చేయగా.. 320 కిలోల గంజాయి బయటపడింది.

మరిన్ని వార్తలు