ఇదెక్కడి చోద్యం..!

18 Nov, 2023 00:36 IST|Sakshi

విజయనగరం ఫోర్ట్‌: సినీఫక్కీ తరహా ఘటన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద శుక్రవారం జరిగింది. 108 అంబులెన్సులో వచ్చిన రోగిని ప్రైవేట్‌ అంబులెన్సు నిర్వాహకుడు బలవంతంగా తన వాహనంలో తరలించుకుపోయాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కావడంతో పైడిరాజు అనే వ్యక్తి చికిత్స కోసం చీపురపల్లి సీహెచ్‌సీలో చేరాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్‌ చేయగా 108 అంబులెన్సులో సిబ్బంది రోగిని సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే సర్వజన ఆస్పత్రి గేటు వద్ద కాపుకాసిన ప్రైవేట్‌ అంబులెన్సు నిర్వాహకుడు ఒకరు 108 అంబులెన్సు ఆస్పత్రి క్యాజువాలిటీ వద్దకు రాగానే లోపలికి ప్రవేశించి రోగిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించాడు. ఎందుకు ఆరోగిని తరలిస్తున్నావు? మేము ఆస్పత్రిలో చేర్చాలని 108 సిబ్బంది చెప్పగా, ఆ పేషెంట్‌ తమ పేషెంట్‌ అని వాదులాడి ఇక్కడితో మీ పని అయిపోయింది. నేను పేషేంట్‌ను తీసుకుని వెళ్తాను. ఏం చేసుకుంటారో? చేసుకోండంటూ పేషెంట్‌ను ప్రైవేట్‌ అంబులెన్సులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయాడు. దీంతో 108 సిబ్బంది బి.రవికుమార్‌, ఎస్‌. వేణుగోపాల్‌రావులు ఈ విషయమై డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేశారు. ఇదేవిషయాన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆర్‌ఎంఓ సురేష్‌బాబు వద్ద సాక్షి ప్రస్తావించగా క్యాజువాలిటీ ఆవరణ వద్దకు రాగానే ప్రైవేట్‌ అంబులెన్సు నిర్వాహకుడు పేషెంట్‌ను తన అంబులెన్సులో తరలించినట్లు 108 సిబ్బంది చెప్పారని, ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సర్వజన ఆస్పత్రిలోకి ప్రైవేట్‌ అంబులెన్స్‌లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు