ధాన్యం సేకరణపై అపోహలు సృష్టిస్తే చర్యలు

18 Nov, 2023 00:36 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌
● మద్దతు ధరకే రైతులు విక్రయించాలి ● కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పండిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ అన్నారు. ధాన్యం సేకరణకు పూర్తి ఏర్పాట్లు చేశామని, ధాన్యం సేకరణపై అపోహలు, వదంతులు సృష్టించే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై అధికారులు, మిల్లర్లు, లారీ సంఘం ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 3.23 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం దిగుబడి అంచనా వేశామని, రైతులు వారి ధాన్యాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన 185 కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు విక్రయించవచ్చని తెలిపారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకంటే తక్కువకు విక్రయించవద్దని సూచించారు. రైతులను ప్రలోభపెట్టి, ఇబ్బందిపెట్టి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రం స్థాయిలో వలంటీర్లతో సమావేశం ఏర్పాటుచేసి ధాన్యం సేకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో మొదటి పదిరోజులు కీలకమని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనా వేసి ముందుగా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతుల నుంచి ఫిర్యాదులు లేకుండా సివిల్‌ సప్లయిస్‌, రవాణా, వెలుగు, జీసీసీ, వ్యవసాయ, సహకారశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జేసీ ఆర్‌.గోవిందరా వు, ఆర్‌డీఓలు కె.హేమలత, ఎం.లావణ్య, సివిల్‌ సప్‌లైౖస్‌ జిల్లా మేనేజర్‌ ఎం.దేవుళ్ల నాయక్‌, వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు