12కిలోల గంజాయి పట్టివేత

13 May, 2023 00:50 IST|Sakshi

మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల పోలీసు స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు గంజాయి పాటు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. బలిమెల ఐఐసీ జాన్‌ఖుజుర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది టోనాల్‌ క్యాంప్‌–ఖడికజోడి గ్రా మాల మధ్య శుక్రవారం వేకువజామున అతివేగంగా వెళ్తున్న బైక్‌ను గమనించారు. అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ లో 12కిలోల గంజాయిని గుర్తించారు.

ఈ నేపథ్యంలో బైక్‌పై ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు. గంజాయిని ఢిల్లీకి చెందిన యువతి సాబ.. చిత్రకొండలో దీనిని కొనుగోలు చేసి, కుమార్‌గుడకు చెందిన యువకుడు సనియా ముదిలికి అప్పగించినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి మల్కన్‌గిరి, రాయిపూర్‌ మీదుగా ఢిల్లీకి తరలించేందుకు రవాణా చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ రూ.60 వేలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అరెస్ట్‌..
పర్లాకిమిడి:
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు జరిపిన దాడుల్లో 23కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ప్రభాత్‌కుమార్‌ శెఠి ఆదేశాల మేరకు ఎస్‌ఐ లింగరాజ్‌ దామిన్‌ పర్లాకిమిడి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని తనిఖీ చేశారు. మోహానా సమితి పట్టిగజపతి గ్రామానికి చెందిన నిందితుడు అజయ్‌ నాయక్‌ వద్ద నుంచి 15.2 కిలోల గంజాయి పట్టుబడింది.

అలాగే రాయఘడ బ్లాక్‌ లంజిపదర్‌ జంక్షన్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎకై ్సజ్‌ ఎస్‌ఐ మంగళ త్రిపాఠి బైక్‌పై రవాణా చేస్తున్న వ్యక్తి నుంచి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అడవ పోలీసు పరిధి కేసరిగుడ గ్రామానికి చెందిన జైన్‌ రైకాగా గుర్తించారు. దాడుల్లో దీపక్‌ మహాపాత్రొ, ఏఎస్‌ఐ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. నిందితులను పర్లాకిమిడి కోర్టుకు తరలించారు.

మరిన్ని వార్తలు