చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు | Sakshi
Sakshi News home page

చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు

Published Sun, Nov 19 2023 12:50 AM

మాట్లాడుతున్న మంత్రి సరక - Sakshi

● రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ● మంత్రి జగన్నాథ సరక

రాయగడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని మంత్రి జగన్నాథ సరక సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈసారి పునరావృతం అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పంట చేతికివచ్చి రెండు నెలలు పూర్తవుతున్నా, జిల్లా యంత్రాగం కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు అందుకు అవసరమైన మండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మండీలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం భద్రంగా ఉండేవిధంగా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

డిసెంబర్‌ 20 నుంచి ధాన్యం కొనుగోళ్లు

ఈ ఏడాది డిసెంబర్‌ 20వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించిన మీదట ఈ తేదీని ఖరారు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారి రాజ్‌ కిషోర్‌ పాణిగ్రహి ప్రకటించారు. రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని 11 సమితుల్లో 42 మండీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. అయితే రైతుల కోరిక మేరకు అదనంగా మరో రెండు మండీల ఏర్పాటు విషయమై చర్యలు తీసుకుంటామని పాణిగ్రహి అన్నారు.

9,53,731 క్వింటాళ్ల ధ్యాన్యం సేకరణ లక్ష్యం

ఈ ఏడాది ఖరీప్‌లో పండించిన పంటల్లో భాగంగా రైతుల నుంచి 9,53,731 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడమే జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుందని సీఎస్‌వో కిషోర్‌ తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ప్రకటించారు. కామన్‌ ధాన్యం క్వింటాల్‌ ధర రూ.2,185 కాగా, ఏ–గ్రేడ్‌ ధాన్యం ధర రూ.2,203 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి, గుణుపూర్‌ ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగో, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, ఏడీఎం రామేశ్వర్‌ ప్రధాన్‌, సబ్‌ కలెక్టర్‌ కల్యాణి సంఘమిత్ర దేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement