ప్రారంభమైన గోల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు

12 Nov, 2023 00:32 IST|Sakshi
మొదటి రోజు విజయం సాధించిన జట్లు

మొదటిసారి పాల్గొన్న ఒక విదేశీ టీమ్‌

తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన నైజీరియా జట్టు

జయపురం: కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడలోని పాత బొరిగుమ్మ స్టేడియంలో బొరిగుమ్మ మాబుడి ఠకురాణి క్రీడా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ గోల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ పోటీలు శనివారం నుంచి ప్రారంభమైంది. ఎప్పుడూ దేశంలోని వివిధ ప్రాంతాల జట్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో తొలిసారి ఒక విదేశీ టీమ్‌ నైజీరియా జట్టు పాల్గొనడంతో ఆసక్తి నెలకొంది. పోటీల్లో భాగంగా తొలిరోజు రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో భోపాల్‌ ధనబాద్‌ జట్టుపై నైజీరియా జట్టు విజయ కేతనం ఎగురువేసింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత భువనేశ్వర్‌ టీమ్‌లు తలపడ్డాయి. ఇందులో భువనేశ్వర్‌ టీమ్‌ కోల్‌కత టీమ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

సంతోషంగా ఉంది: హీరో సవ్యసాచి

అంతర్జాతీయ గోల్డ్‌కప్‌ ఫుట్‌బాల్‌ పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఓలివుడ్‌ హీరో సవ్య సాచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బొరిగుమ్మలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. తనకు అపూర్వంగా అభిమానులు, ప్రజలు స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సినీ డైలాగులతో ప్రజలను అలరించారు.

క్రీడా పోటీల నిర్వాహక మాబుడి ఠకురాణి క్రీడా సంఘం అధ్యక్షుడు పద్మణ కుమార్‌ స్వైయ్‌ మాట్లాడుతూ.. న్యాయవాది లాలూ షొడంగి సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో 16 టీమ్‌లు పాల్గొంటున్నాయని వెల్లడించారు. గత 13 ఏళ్ల నుంచి నిర్వహించబడుతున్న ఈ టోర్నమెంట్‌ను ఈ యేడాది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో క్రీడా సంఘం కో–ఆర్డినేటర్‌ అప్పు ఖాన్‌, ఉపాధ్యక్షుడు బబులూ నాగ్‌, కోశాధికారి కై లాస కొచ్చిమ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు