బంగాళాఖాతంలో అల్పపీడనం

12 Nov, 2023 00:32 IST|Sakshi
ఐఎండీ జారీ చేసిన వాతావరణ చిత్రం

ఈనెల 14 నాటికి ఏర్పడే అవకాశం

భువనేశ్వర్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు రోజుల్లో పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ నవంబర్‌ 16 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతం తీరం ప్రభావితం చేస్తుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా... నవంబర్‌ 15వ తేదీన దక్షిణ కోస్తా ఒడిశా, మల్కన్‌గిరి, కొరాపుట్‌, రాయగడ, ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. 16న కోస్తా ఒడిశాలో కొన్ని చోట్లు, మయూర్‌భంజ్‌, కెంజొహర్‌, అంగుల్‌, ఢెంకనాల్‌, బౌధ్‌, కంధమల్‌, కలహండి, రాయగడ, కొరాపుట్‌ మరియు మల్కన్‌గిరిలలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 17న ఉత్తర కోస్తా ఒడిశా, కెంజొహర్‌, మయూర్‌భంజ్‌, ఢెంకనాల్‌, అంగుల్‌, ఖుర్దా, పూరీలోని కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా ఒడిశాలోని మిగిలిన జిల్లాలు, కంధమల్‌, బౌధ్‌, మల్కన్‌గిరి, రాయగడ, నబరంగ్‌పూర్‌, కలహండి మరియు సుందర్‌గడ్‌, కొరాపుట్‌లోని ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

వేగవంతమైన గాలులు

నవంబర్‌ 14–15 తేదీల్లో మధ్య ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రం మీదుగా గంటకు 40–45 కి.మీ వేగంతో వీచే గాలులు గంటకు 55 కి.మీ వేగంగా బలం పుంజుకుంటాయి. నవంబర్‌ 15–16 తేదీలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 40–45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రానున్న 5 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలో భారీ మార్పు ఉంటుందని వాతావరణ శాఖ సమాచారం.

మరిన్ని వార్తలు