ఈనెల 20 నుంచి రాష్ట్రపతి పర్యటన

12 Nov, 2023 00:32 IST|Sakshi

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారు. గతేడాది జూలైలో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము తన సొంత జిల్లాకు రావడం ఇది రెండోసారి. రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్‌ కలైకుండ విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 1.55 గంటలకు మయూర్‌భంజ్‌ జిల్లా బరిపదా చేరుతారు. ఆ తర్వాత ఆమె అఖిల భారత సంతాలి రచయితల సంఘం సాహిత్య ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 21న బాదంపహాడ్‌ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా ఊపి 3 కొత్త ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు రాయ్‌రంగపూర్‌కు రైలులో బయల్దేరుతారు.

ఆగ్నేయ రైల్వేకి కేటాయించిన 4 జతల కొత్త ప్రయాణికుల రైళ్లలో మయూర్‌భంజ్‌ జిల్లాకు 3 జతల రైళ్లు లభించడం విశేషం. వీటిలో కోల్‌కతా (షాలిమార్‌)–బాదంపహాడ్‌–కోల్‌కతా (షాలిమార్‌) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, బాదంపహాడ్‌–రూర్కెలా–బాదంపహాడ్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, రూర్కెలా–టాటానగర్‌–రూర్కెలా (వారానికి 6 రోజులు) మరియు టాటానగర్‌–బాదంపహాడ్‌–టాటానగర్‌ (వారానికి 6 రోజులు) ఉన్నాయి. ఆగ్నేయ రైల్వే పరిధిలో ఈ రైళ్ల రవాణాకు భారతీయ రైల్వే ఇటీవల ఆమోదించింది. ఆమె అదే రోజు సాయంత్రం 4.10 గంటలకు బుర్లా చేరుతారు. బుర్లా వీఎస్‌ఎస్‌యూటీ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఈనెల 22న రాష్ట్రపతి ఉదయం 11.05 గంటలకు బ్రహ్మకుమారీల రైజ్‌ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఆమె ఝార్సగుడ వీర్‌ సురేంద్ర సాయి విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. భారత రాష్ట్రపతి సొంత జిల్లా మయూర్‌భంజ్‌ కులియానాలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను రాష్ట్రపతి నవంబర్‌ 21న ప్రారంభిస్తారని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

మూడు రోజుల పాటు పర్యటన

బాదంపహాడ్‌ నుంచి రాయ్‌రంగపూర్‌ వరకు రైలులో ప్రయాణం

మరిన్ని వార్తలు