Tamilnadu Politics: అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్‌ వార్‌.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు

27 Oct, 2021 07:37 IST|Sakshi

అందుకే చిన్నమ్మ జపం 

మళ్లీ తెర మీదకు అన్నాడీఎంకే కోల్డ్‌ వార్‌ 

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్‌ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది.

చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు.  ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్‌ మద్దతు )

టార్గెట్‌.. ప్రధాన కార్యదర్శి పదవి 
తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్‌లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని  ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.  

చిన్నమ్మ పర్యటన 
ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు.  

చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. 

మరిన్ని వార్తలు