అఖిలేశ్‌పై అమిత్‌ షా మాటల దాడి

14 Nov, 2021 06:17 IST|Sakshi

ఆజంగఢ్‌: పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నాను గాంధీజీ, పటేల్, నెహ్రూతో సమానంగా పోల్చుతూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేశ్‌ జిన్నాలో గొప్పతనం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్‌ సొంత లోక్‌సభ నియోజకవర్గం ఆజంగఢ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ‘జేఎఎం’ జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ ఫోన్లు ఇవ్వగా, సమాజ్‌వాదీ నేతలు మాత్రం ‘జేఏఎం’..జిన్నా, ఆజంఖాన్, ముఖ్తార్‌(డాన్‌ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ)లను తెరపైకి తెచ్చారు’ అంటూ విమర్శించారు. సీఎం యోగి  తీసుకుంటున్న కఠిన చర్యలతో పూర్వాంచల్‌ ప్రాంతంలో మాఫియా ముఠాలే కాదు, దోమలు కూడా పరారయ్యాయన్నారు. 

మరిన్ని వార్తలు