సిర్పూర్‌ పైనే ఏనుగంత ఆశ!

3 Dec, 2023 02:06 IST|Sakshi

త్రిముఖ పోటీలో ఫలితంపై బీఎస్పీలో ఉత్కంఠ

కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే స్థితిలో బీఎస్పీ

సాక్షి, హైదరాబాద్‌: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్‌ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌  బీఎస్‌పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు.

సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని  ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి.

ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. 
సిర్పూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌లకు పార్టీ అభ్యర్థి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఈ మేరకు ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్‌ఎస్‌కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఓట్లు పంచుకుంటే బీఎస్‌పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్‌ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ
సిర్పూర్‌తో పాటు చివరి నిమిషంలో బీఎస్‌పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్‌ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్‌ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్‌ సోదరుడు ఆర్‌. ప్రసన్న కుమార్‌ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది.

ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్‌ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు