మహారాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై వీడిన సందిగ్ధం

13 Aug, 2022 16:14 IST|Sakshi
చంద్రశేఖర్‌ భావన్‌కుళే, ఆశిష్‌ శేలార్‌

బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా భావన్‌కుళే 

సాక్షి, ముంబై: బీజేపీ మహారాష్ట్ర నూతన అధ్యక్షుడిగా విదర్భకు చెందిన ప్రముఖ ఓబీసీ నేత, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ భావన్‌కుళే నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన ఎమ్మెల్యే సంజయ్‌ కుంటే పేరు కూడా అధ్యక్ష పదవికి వినిపించినప్పటికీ భావన్‌కుళే వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చంద్రకాంత్‌ పాటిల్ ఇటీవల లోక్‌నాథ్‌ షిండే కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు కనబడుతోంది.

ముంబై రీజియన్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఆశిష్‌ శేలార్‌ ఎంపికయ్యారు. ఇటీవల షిండే మంత్రివర్గంలో చేరిన మంగళ్ ప్రభాత్ లోధా స్థానంలో ఆయన నియమితులయ్యారు. బాంద్రా వెస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆశిష్‌.. గతంలో బీజేపీ-శివసేన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, లోక్‌నాథ్‌ షిండే కేబినెట్‌లో అత్యంత ధనవంతుడైన మంత్రిగా మంగళ్ ప్రభాత్ లోధా గుర్తింపు పొందారు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ.441 కోట్లు. (క్లిక్: షిండే వర్గం కోసం శివసేన కొత్త భవనం‌?)

మరిన్ని వార్తలు