‘రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది’

15 Feb, 2021 14:35 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారుపై భట్టి విక్రమార్క ధ్వజం

నారాయణ్‌ఖేడ్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతులను కార్పొరేట్ శక్తులకు బలి ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. వీటిని అడ్డుకునే క్రమంలోనే తాము రైతులతో ముఖాముఖి, పొలంబాట-పోరుబాట చేపట్టామని, అన్నదాతల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండెల్లో వణుకు పుడుతోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్ల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నారాయణ్‌ఖేడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టివిక్రమార్క పాల్గొన్నారు. (చదవండిఎమ్మెల్సీ ఎన్నికలు; వ్యూహరచనలో కాంగ్రెస్‌)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కారు ప్రజలను మోసం చేస్తోందని, రైతులచేతో కన్నీరు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధికై, అన్నదాతలకు అండగా ఉండేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇక తమపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు దీటుగా బదులిచ్చిన.. భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడిగా తాను తిరిగేది పదవుల కోసం కాదని.. ప్రజల కోసమని చురకలు అంటించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తెలుసుకోవాలని హితవు పలికారు. పదవుల కోసమే అయితే తాము కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల వలె ప్రజలను మోసం చేసే వాళ్లమని, కానీ తాను పర్యటించేది రైతులకు అండగా ఉండేందుకేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు