అమిత్‌షాపై ఆ ప్రచారం తప్పు.. భయం వల్లే ఇలా చేస్తున్నారు: బండి సంజయ్‌

21 Aug, 2022 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్య ప్రచారం నమ్మొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మీటర్లపై రైతులు అమిత్‌షాను నిలదీశారనడం అవాస్తవం అన్నారు. సీఎం కేసీఆర్‌ లీకుల పార్టీ నాయకుడని ఆయన మండిపడ్డారు.
చదవండి: కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్‌ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్‌!

కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని.. నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. వామపక్షాలను సూది దబ్బునంతో పోల్చిన కేసీఆర్‌తో ఎలా జత కడతారని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

రైతులతో అమిత్‌ షా
మునుగోడు బహిరంగ సభకు వెళ్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో రైతు సంఘాల నేతలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోందని రైతులను ఆరా తీశారు. విద్యుత్‌ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్‌ షాను కోరగా.. ‘మార్చాల్సింది చట్టం కాదు. ఇక్కడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్‌ మీడియాలో ఓ చర్చ వైరల్‌గా మారింది. హోమంత్రి అమిత్‌షాను తెలంగాణ రైతు సంఘాల నేతలు ఇరుకున పెట్టారని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరేమో టీఆర్‌ఎస్‌ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు