రాఘవులే రైట్‌...

28 Mar, 2023 02:17 IST|Sakshi

అసమ్మతితో అలిగిన నేతకు సీపీఎం అధిష్టానం బుజ్జగింపు 

పొలిట్‌బ్యూరోలో కొనసాగనున్న సీనియర్‌ నేత 

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం అధిష్టానం బీవీ రాఘవులును బుజ్జగించింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో కొనసాగాలని ఆయన్ను కోరింది. దీంతో రాఘవులు రాసిన లేఖపై రెండు మూడు రోజులుగా నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లయింది. పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి తనను తప్పించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తానని బీవీఆర్‌ ఇటీవల పార్టికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాఘవులుపై ఒక వర్గం పొలిట్‌బ్యూరోకు ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ వివాదంపై పార్టీ పొలిట్‌బ్యూరో ఒక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక కూడా పార్టికి చేరింది. రెండ్రోజుల పాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశాల్లో రాఘవులు అంశం చర్చకు వచ్చింది. ఆయన్ను పార్టీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో రాఘవులు కూడా మెత్తబడ్డారని అంటున్నారు. 

బయటకొస్తే క్యాడర్‌లో నైరాశ్యం... 
మతోన్మాదంపై వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా ఉన్న రాఘవులు పార్టీ కీలక బాధ్యతల నుంచి బయటకు వస్తే ఆ ప్రభావం క్యాడర్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ ఐక్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ తరుణంలో పార్టిలో లుకలుకలు కనిపించడం మంచిది కాదని పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిసింది.

‘ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించాం. రాఘవులు వివాదం ముగిసిపోయింది. రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలున్నాయి. వాటి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఏపీలో అమలు చేస్తాం’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాఘవులు కూడా  పార్టీ విజ్ఞప్తికి ఒప్పుకోక తప్పలేదు.  

ఏపీలో అంతర్గత వివాదాల వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పినట్టు తెలిసింది. ఇక నుంచి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం.  

ఒక వెలుగు వ్చెలిగిన రాఘవులు... 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాఘవులు కార్యదర్శిగా ఉండి అనేక పోరాటాలు చేశారు. విద్యుత్‌ ఉద్యమం ఆయన హయాంలోనే జరిగింది. పోరాట పటిమగల నేతగా ఉన్నత స్థాయి పదవి పొలిట్‌బ్యూరో వరకు వెళ్లారు. ఆయన సింప్లిసిటీ కూడా క్యాడర్‌ను ఉత్తేజపరిచేది.

అయితే తర్వాత తర్వాత ఆయన హయాంలోనే పార్టీ వెనుకపట్టు పట్టిందన్న విమర్శలున్నాయి. 10 టీవీ అమ్మడం వంటి విషయాల్లోనూ విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా కొద్దిరోజులుగా నలుగుతున్న రాఘవులపై అసమ్మతి వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణగడంతో సీపీఎం శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.  

మరిన్ని వార్తలు