సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!

25 Sep, 2020 10:28 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా కొద్ది పార్టీల్లో టెన్షన్‌ మొదలైంది. ఎన్నికల్లో పోటీ మొదలు పొత్తులు, సీట్ల పంపకాల అంశాలపై చర్చించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ-కాంగ్రెస్‌ మధ్య ముందునుంచే ఒప్పందం కుదిరినా.. అధికార ఎన్డీయే కూటమి సీట్ల పంపకం మాత్రం ఓ కొలిక్కి రావడంలేదు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతిపాదిస్తున్న 50-50 పార్మూలా తమకు వర్తించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను బిహార్‌ రాజకీయాల్లో కీలకశక్తిగా తయారుచేయాలని దృఢసంకల్పంతో ఉన్న రాంవిలాస్‌.. ఆ మేరకు తగిన ప్రణాళికలను రచిస్తున్నారు. నితీష్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనిలోభాగంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ నుంచి చిరాగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కూటమితో ఎన్నుకునే సీఎంకు ప్రజల మద్దతు ఉన్నట్లు కాదని, నేరుగా ప్రజల ద్వారానే ఎన్నికైన నాయకుడే నిజమైన సీఎం అని ఎల్‌జేపీ పేర్కొంది. (చాణిక్యుడి చతురత.. వృద్ధ నేత వ్యూహాలు)

దశాబ్ధాలుగా బిహార్‌ రాజకీయాలను ఏలుతున్న నితీష్‌ కుమార్‌కు ప్రజల్లో సరైన ఆధరణలేదని, ఇప్పటికీ బీజేపీ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారని వాదిస్తోంది. తమకు బీజేపీ ఎంతటి కీలకమైన భాగస్వామ్య పార్టీనో.. జేడీయూకు కూడా అంతేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎల్‌జేపీపై నితీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పార్టీని తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా గుర్తించడంలేదని, వారి అవసరం తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. బీజేపీ ప్రతిపాధించిన 50-50 ఫార్మాలాకు తాము కట్టుబడి ఉన్నామని, ఎల్‌జేపీకి మాత్రం తాము సీట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే బీజేపీకి దక్కిన వాటలో వారు సీట్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఇక ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని బీజేపీ ఏవిధంగా పరిష్కరిస్తోందో వేచిచూడాలి. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నేడు (శుక్రవారం) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా