థాక్రేకు ఫడ్నవీస్‌ కౌంటర్‌.. మీకు ఆ పదాలు సూట్‌ కావు అంటూ..

11 May, 2023 21:17 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్‌కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.. ఉద్దవ్‌ థాక్రేకు పొలిటికల్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్‌ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్‌కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 

గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్‌ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం

మరిన్ని వార్తలు