టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా

3 Dec, 2022 07:17 IST|Sakshi

టీడీపీలో తిరుగుబావుటా!

పలు నియోజకవర్గాల్లో తారస్థాయికి ‘గ్రూప్‌’ వార్‌

మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఎదురుగాలి 

విజయవాడ పశ్చిమంలో ముదిరి పాకాన పడ్డ వర్గ విభేదాలు

గన్నవరంలో బచ్చుల అర్జునుడికి అసంతృప్తి సెగ

సొంత కార్యకర్తల నుంచే నాయకులకు షాక్‌లు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్‌చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్‌ ఇచ్చారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచీ ఉన్న విభేదాలు ఇటీవల మరింత ముదిరాయి. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా బుజ్జగింపులకు దిగినా.. అక్కడి నేతలు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.

చక్రం తిప్పిన ఉమాకు సెగ.. 
టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమాకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు నియోజకవర్గంలో ఎదురు నిలిచి మాట్లాడటానికే సాహసించని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం ఉమాను వ్యతిరేకిస్తూ.. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టికెట్టు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వారు తీర్మానం చేశారు.

మరోవైపు టీడీపీ అంతర్గత సర్వేలో సైతం ఉమాకు అనుకూలంగా లేకపోవడంతో, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు చేస్తున్న వాదానికి బలం చేకూర్చుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్టు దక్కడం కష్టమని స్థానిక టీడీపీ నేతలే బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఉమాలో అంతర్మథనం మొదలై, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి, పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నట్లు  పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.

పశ్చిమంలో వర్గ పోరు.. 
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అక్కడ పార్టీ ఇన్‌చార్జిగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పేపర్‌ పులులుగా పేర్కొన్న ఇద్దరు ముఖ్యనేతలు నియోజకవర్గ ఇన్‌చార్జి చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బహిరంగంగానే ఇన్‌చార్జిపై అసమ్మతి గళం విప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ సైతం పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్తిక వనసమారాధనల సమయంలోనూ.. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయి. దీనికితోడు తాజాగా ఎంపీ సోదరుడు నియోజకవర్గంలో వేరు కుంపటి పెట్టడంతో పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గన్నవరం.. తమ్ముళ్ల పంతం..
అసలే అంతంత మాత్రంగా ఉన్న గన్నవరం టీడీపీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. గన్నవరంలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి నేతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బచ్చుల అర్జునుడునే అతికష్టం మీద ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పంపించారు. అయితే బచ్చుల అర్జునుడుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పార్టీనేతలు సమావేశం ఏర్పాటు చేసుకొని, పార్టీ నేతలను కలుపుకుపోవటంలో అర్జునుడు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని తిరుగుబావూటా ఎగరవేశారు.

సీనియర్‌ కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నారని బహిరంగానే గన్నవరం టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటికి బలం చేకూర్చే విధంగా ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురురేగిన టీడీపీ నేతలు, కార్యకర్తలు బాబు సమక్షంలో బచ్చుల అర్జునుడు వద్దంటూ నినాదాలు చేశారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు.  పార్టీలో ఈ పరిణామాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
చదవండి: పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!   

మరిన్ని వార్తలు