సీఎం కేసీఆర్‌కు పోయేకాలం దగ్గర పడింది

3 Oct, 2022 08:24 IST|Sakshi

మెదక్‌జోన్‌: టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8 వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు పోయేకాలం దగ్గర పడిందని, వినతిపత్రాన్ని వీఆర్‌ఏల మొహం మీదికి విసిరేసి అవమానించిన కేసీఆర్‌ను రాజకీయంగా పాతర పెట్టాలని అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లాకేంద్రంలోని రాందాస్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్షల కోట్ల అవినీతి చేసి, ఇప్పుడు దేశంలో కొత్తపార్టీ పెట్టి ప్రజలను ఉద్దరిస్తాడట అని కేసీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు.

‘కేసీఆర్‌ రూ.100 కోట్లు పెట్టి జెట్‌ విమానాలు, హెలికాప్టర్‌ కొంటారట, ఇది ప్రజల సొమ్ముకాదా’అని ఆమె నిలదీశారు. కేసీఆర్‌ అన్ని వర్గాలవారిని మోసం చేశారని, రైతులకు రుణమాఫీ అంటూ ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పారీ్టలు పేరుకే ఉన్నాయని, కేసీఆర్‌ అవినీతి పాలనను ప్రశ్నించిన పాపాన పోవడంలేదని మండిపడ్డారు.

‘వైఎస్సార్‌ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకొస్తాను. నేను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఊపిరిని. నన్ను ఆశీర్వదిస్తే నాన్నగారి పాలనను మళ్లీ మీ కళ్ల ముందు ఉంచుతాను’అని తెలిపారు. ఆమె వెంట పార్టీ నేతలు ఏపూరి సోమన్న, సంజీవరావు, జిల్లా అధ్యక్షులు వనపర్తి వెంకటేశం తదితరులు ఉన్నారు.
చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్‌

మరిన్ని వార్తలు