Sakshi News home page

కాంగ్రెస్‌కు మద్దతు షర్మిల విధాన నిర్ణయం

Published Sat, Nov 4 2023 4:46 AM

Sajjala Ramakrishna Reddy about sharmila - Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిల మద్దతివ్వడం ఆమె పార్టీపరంగా తీసుకున్న నిర్ణయం కావచ్చునని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. పక్క రాష్ట్ర విషయాల గురించి సీఎం జగన్‌ పెద్దగా పట్టించుకోరని ఆయనన్నారు.

వైఎస్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసునని.. సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు వైఎస్‌ జగన్‌తో పాటు షర్మిలమ్మ కూడా ఉన్నారని గుర్తుచేశారు. అయినా ఆమె పార్టీ విధానపరమైన నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ఉండొచ్చునని ఆయనన్నారు. సచివాలయంలో శుక్రవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  

బాబు పాలనంతా కుంభకోణాలే
చంద్రబాబు స్కాంలు చాలా ఉన్నాయి. వాటికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారు. ఎన్నికల సమయంలో ఆయనపై రాజకీయ కక్ష సాధింపు ఎందుకు చేస్తాం. అలాచేసే వాళ్లమైతే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండే వాళ్లం.

తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. నిజానికి.. చంద్రబాబు పాలన అంతా కుంభకోణాలమయం. లిక్కర్‌ స్కాంలో ఫైనాన్స్‌ శాఖ, కేబినెట్‌ నిర్ణయానికి సంబంధం లేకుండా ప్రివిలేజ్‌ ఫీజు ఎత్తేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1,300 కోట్ల నష్టం జరిగింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా జరిగిందంటే ఎలా? చంద్రబాబును విచారించకుండా ఎలా ఉంటాం?    

అప్పట్లో ఇసుక ఎక్కడైనా ఉచితంగా దొరికిందా? 
ఇక ఉచిత ఇసుక అన్నారు.. అప్పట్లో ఎక్కడైనా అది ఉచితంగా దొరికిందా? ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి. కానీ, పెద్దపెద్ద పొక్లెయినర్లు పెట్టి దందా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు. అదే ఇప్పుడు ఇసుకపై ఏటా రూ.765 కోట్లు ప్రభుత్వానికి వస్తోంది. గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? టీడీపీ నేతలు ఇసుక ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. ఇది ప్రజలకు కూడా తెలుసు.

ఇక ఈ విషయంలో పురందేశ్వరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు స్పష్టత ఉంది. ఆమె ఫిర్యాదు చేస్తే బాబుపై ఎందుకు కేసు పెడతాం. నిజానికి.. చంద్రబాబు వాయిస్‌ను ఆమె బీజేపీ నుంచి వినిపిస్తున్నారు. అసలు పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీకి ఉపాధ్యక్షురాలా? ఇక దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఇక్కడ అనేక పథకాలు తీసుకొచ్చాం. 

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement