బీజేపీ పొత్తు కోసమే బాబు నాటకాలు 

23 Dec, 2022 02:55 IST|Sakshi
మంత్రులు పువ్వాడ, శ్రీనివాస్‌గౌడ్, కొప్పులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు 

ఏపీలో చీత్కారానికి గురై ఇక్కడ అభివృద్ధి మంత్రమా?: హరీశ్‌

చంద్రబాబు పాలనలోనే తెలంగాణ వ్యవసాయ సంక్షోభం 

విద్యుత్‌ చార్జీలను వ్యతిరేకించిన రైతులను కాల్చి చంపారు 

ఆయనది భస్మాసుర హస్తం.. ప్రజలే బుద్ధి చెప్తారు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాను అన్నట్టుగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారం కనిపిస్తోంది. ఏపీని అభివృద్ధి చేయలేక అప్పుల పాలు చేసి చీత్కారానికి గురైన ఆయన తెలంగాణలో ఉద్ధరి­స్తానని మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన వ్యక్తి ఇక్కడేం చేస్తారు? చంద్రబాబుది భస్మాసుర హస్తం. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే నాటకాలు ఆడుతున్నారు..’’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు.

చంద్రబాబు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పెడితే ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా ఏదో ఉద్ధరిస్తానంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో టీడీపీ సభ పెట్టి పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని విమర్శించారు. ఏపీలో కష్టపడితే నాలుగు ఓట్లయినా వస్తాయని, అక్కడ చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అని వ్యాఖ్యానించారు. గురువారం బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రులు పువ్వాడ అజయ్, వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌లతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

ప్రశ్నిస్తే కాల్చి చంపారు.. 
తెలంగాణ యువత, విద్యార్థులు, రైతులతోపాటు అన్ని రంగాలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన పాలనను ప్రశ్నించిన యువత, విద్యార్థులను నక్సలైట్ల పేరిట కాల్చి చంపారని హరీశ్‌రావు ఆరోపించారు. ఫ్రీజోన్‌ పేరిట హైదరాబాద్‌ను హస్తగతం చేసుకుని యువత నోట మట్టికొట్టారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి అంతా తనవల్లేనని చెప్పుకొంటున్న చంద్రబాబు.. చివరికి కేసీఆర్‌ కృషితో పరిష్కారమైన నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు.

విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకించిన రైతులను బషీర్‌బాగ్‌ చౌరస్తాలో కాల్చిచంపిన చంద్రబాబుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకునే రకమని, ఆయనకు ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మబోరని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఉందని చెప్పారు. 

ఒక్క ప్రాజెక్టూ తేలేదు.. 
ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్లు రుజువు చేసినా ముక్కు నేలకు రాస్తానని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. నాడు చంద్రబాబు వల్లే భద్రాచలం కరకట్ట నిర్మాణం పూర్తిగా జరగలేదని.. దీనితో పట్టణం వరద ముప్పు ఎదుర్కుంటోందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారన్నారు. లకారంలో 30 అడుగుల ఎన్‌టీఆర్‌ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. 

వేల మంది మరణాలకు కారకుడు.. 
చంద్రబాబు రాక వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది మృతికి కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.

తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష: హరీశ్‌రావు 
రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు ఉపాధి హామీ పథకం నిధులతో కల్లాలు నిర్మించుకుంటే.. అందుకు ఖర్చు చేసిన రూ.151 కోట్లను వెనక్కి ఇవ్వాలని కేంద్రం అడగటం దారుణమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో చేపలు ఆరబెట్టే కల్లాల నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందని చెప్పారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించనందునే ఐదేళ్లలో రూ.30వేల కోట్లు రాకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని, పనిదినాలను కూడా పరిమితం చేసిందని చెప్పారు.

మరిన్ని వార్తలు